శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ శ్రీ వాసవి ఆర్య వైశ్య వేదిక ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని విశ్వనాథ్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్తీక మాస వన భోజన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గజ్జల యోగానంద్, మాజీ టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ శ్రీ వాసవి ఆర్య వైశ్య వేదిక ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు. అన్ని కులాలను గౌరవిస్తూ ఆర్య వైశ్య సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఆర్య వైశ్యుల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, అన్ని విధాలుగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

కార్తీక మాసంలో కాలనీవాసులు, బంధువులు, స్నేహితులు కలిసి చెట్ల నీడలో, ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద సామూహికంగా భోజనం చేయడాన్ని వన భోజనంగా పిలుస్తారని గాంధీ తెలిపారు. ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడంతోపాటు ఆత్మీయత, ఐక్యతను పెంపొందించే సంప్రదాయం వన భోజనమని పేర్కొన్నారు. వర్షాకాలం అనంతరం వచ్చే శీతాకాలంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించే వన భోజనాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. చెట్లు, పచ్చదనం మధ్య గడపడం ద్వారా ప్రకృతితో మమేకమయ్యే అవకాశం లభిస్తుందని తెలిపారు. వన భోజనాల ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెరగడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యత కూడా అలవడుతుందని చెప్పారు.

ప్రకృతిని మనం కాపాడుకుంటే.. ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే సందేశం వన భోజనాల్లో అంతర్లీనంగా ఉందని గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత భావన, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందుతాయని, బంధుమిత్రుల మధ్య సాన్నిహిత్యం పెరిగి సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కుటుంబ సభ్యులు, వేదిక ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.





