శేరిలింగంపల్లి, నవంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల, జయప్రకాష్ నారాయణ్ నగర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా సందర్శించారు. వైద్య సిబ్బందితో కలిసి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. మియాపూర్ డివిజన్లోని పలు కాలనీల్లో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్ల సహకారంతో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో వ్యాధి నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. నిండు జీవితానికి రెండు చుక్కలు.. పోలియో రహిత భారతదేశమే మన లక్ష్యం అనే నినాదంతో చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బాలింగ్ వెంకటేష్ గౌడ్, బాలు నాయుడు, మహేశ్వర్ రెడ్డి, సాంబయ్య, నరేష్ నాయక్, రాజేశ్వరి, ఆశా వర్కర్లు సుజాత, లక్ష్మీతో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





