శేరిలింగంపల్లి, నవంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): నిండు జీవితానికి రెండు చుక్కలు నినాదంతో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శేరిలింగంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో కలిసి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో రహిత భారతదేశమే మనందరి లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి బిడ్డకు క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను సకాలంలో వేయించాలని అన్నారు.

పోలియో చుక్కలు పూర్తిగా ఉచితమని, అత్యంత సురక్షితమైనవని పేర్కొంటూ తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమీపంలోని పోలియో కేంద్రాలకు వెళ్లి చుక్కల మందు వేయించాలని కోరారు. దేశాన్ని పోలియో రహితంగా నిలబెట్టడం ప్రతి తల్లిదండ్రి సామాజిక బాధ్యతగా భావించాలని, ప్రభుత్వం చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, బస్టాండ్లు, ఇతర ప్రత్యేక కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. పోలియో బూత్‌లకు రాలేని చిన్నారుల కోసం ఆరోగ్య కార్యకర్తలు తదుపరి రెండు, మూడు రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తారని వివరించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత దేశం, రాష్ట్రంతోపాటు పోలియో రహిత శేరిలింగంపల్లి నియోజకవర్గ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనూష, డాక్టర్ దివ్య, వైద్య సిబ్బంది, నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, లక్ష్మారెడ్డి, మిరియాల ప్రీతమ్, సాదిక్, పార్టీ కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






