శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ఏడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు, క్రీడా సముదాయాలు, కమ్యూనిటీ హాళ్లలో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల పరిధిలోని వివిధ ప్రభుత్వ సంస్థలు, ప్రజా వినియోగ కేంద్రాలు, కమ్యూనిటీ సదుపాయాల్లో పారిశుధ్య సిబ్బంది విస్తృతంగా శుభ్రత పనులు చేపట్టారు. ఆయా ప్రాంగణాలతో పాటు పరిసర ప్రాంతాల్లో చెత్తను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ పరిధిలో మొత్తం 88 ప్రభుత్వ కార్యాలయాలు, 73 కమ్యూనిటీ హాళ్లు, 25 క్రీడా సముదాయాల్లో పారిశుధ్య పనులు నిర్వహించారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న, నిరుపయోగంగా వదిలేసిన 13 వాహనాలను తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాలు, క్రీడా ప్రాంగణాలు, కమ్యూనిటీ హాళ్లలో పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడం, చెత్త పేరుకుపోకుండా నివారించడం, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని CMC పేర్కొంది. సైబరాబాద్ పరిధిలో పారిశుధ్య నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో సమన్వయంతో ప్రత్యేక కార్యక్రమాలను కొనసాగిస్తామని కార్పొరేషన్ స్పష్టం చేసింది. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు పౌరులు, ప్రభుత్వ సంస్థలు, కమ్యూనిటీ సంఘాలు పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని CMC విజ్ఞప్తి చేసింది.





