మదీనాగూడ సాయినగర్ కాలనీ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ సాయినగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ (UGD) ఔట్‌లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జలమండలి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి సమస్య తీవ్రతను, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. సాయినగర్ కాలనీలో డ్రైనేజీ ఔట్‌లెట్ సరిగా లేకపోవడంతో తరచూ మురుగునీరు పొంగిపొర్లుతూ కాలనీ ముంపునకు గురవుతోందని, దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే యూజీడీ ఔట్‌లెట్ నిర్మాణ పనులు ప్రారంభించి, యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

ఔట్‌లెట్ నిర్మాణానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన ప్రతిపాదనలు త్వరితగతిన రూపొందించాలని జలమండలి అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మళ్లీ డ్రైనేజీ సమస్య తలెత్తకుండా పటిష్టమైన నిర్మాణం చేపట్టాలని అధికారులకు పలు సూచనలు చేశారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గాంధీ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన ప్రజా జీవనానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు డీజీఎం నారాయణ, మేనేజర్ శిరీష, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, నరేందర్ బల్ల, స్వామి, సాయినగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here