ఓల్డ్ ఎం.ఐ.జి. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: PAC చైర్మన్ గాంధీ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎం.ఐ.జి. కాలనీలో గత 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తామని, రైల్వే విస్తరణ పనుల కారణంగా గుడిసెలు కోల్పోతున్న అర్హులైన బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు కేటాయించేలా కృషి చేస్తామని PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు.

రైల్వే విస్తరణ పనుల నేపథ్యంలో ఓల్డ్ ఎం.ఐ.జి. కాలనీలో నివసిస్తున్న పేద కుటుంబాలు గుడిసెలు కోల్పోయి నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించి తమకు ప్రత్యామ్నాయ నివాస సౌకర్యం కల్పించాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, సీనియర్ నాయకుడు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలు సోమవారం PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా అక్కడే నివాసం ఉంటున్న పేద కుటుంబాలు రైల్వే విస్తరణ కారణంగా నివాసాలను కోల్పోతున్నాయని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబాలకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

బాధితుల వినతిపై సానుకూలంగా స్పందించిన ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. రైల్వే విస్తరణ పనుల్లో గుడిసెలు కోల్పోతున్న అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేద కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు భాస్కర్ ముదిరాజ్, బాధిత కుటుంబాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here