శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులను అధికారులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఆదేశించారు. పురపాలక సేవలకు సంబంధించిన పలు సమస్యలపై ప్రజలు తమ వినతులను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.

వివిధ సర్కిళ్ల వారీగా స్వీకరించిన వినతుల వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ లో 8 ఫిర్యాదులు స్వీకరించగా, మియాపూర్ సర్కిల్ లో 5, అమీన్‌పూర్ సర్కిల్ లో 3, నార్సింగి సర్కిల్ లో 5, పటాన్‌చెరు సర్కిల్ లో 2, జోనల్ కార్యాలయంలో 6, మొత్తంగా 29 వినతులను అధికారులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను సమర్థవంతంగా, వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రజాభిముఖ, పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజావాణి ద్వారా ప్రజలకు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.





