శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): పీజేఆర్ స్టేడియంలోని యోగా ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ యోగాభ్యాసకులు సోమవారం పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్‌లకు వినతిపత్రాలు సమర్పించారు. యోగా శిక్షకులు పుట్ట వినయ్ కుమార్ గౌడ్, జగన్నాథం నేతృత్వంలో యోగాభ్యాసకులు తమ సమస్యలను ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

గత 12 సంవత్సరాలుగా పతంజలి యోగా ప్రోటోకాల్ ప్రకారం పీజేఆర్ స్టేడియంలో ప్రతిరోజూ ఉచిత యోగా తరగతులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. యోగాభ్యాసకులందరూ ప్రతి నెలా సీఎంసీకి విధిగా అద్దె చెల్లిస్తున్నప్పటికీ, అందుకు తగిన సౌకర్యాలు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో యోగా సాధన చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. యోగా ప్రాంగణానికి పైకప్పుతో కూడిన షెడ్డు నిర్మించాలని, పాముల బెడద నివారించేందుకు చుట్టూ మూడు అడుగుల ఎత్తులో ప్రహరీ ఏర్పాటు చేయాలని కోరారు. యోగా మ్యాట్లు, సౌండ్ సిస్టమ్, ఇతర విలువైన పరికరాలను భద్రపరుచుకునేందుకు రెండు గదులు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే షెడ్డు చుట్టూ గాలి, వెలుతురు ప్రసరించేలా మెష్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం స్టేడియంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో యోగా ప్రాంగణంలోనూ తక్షణమే అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

యోగాభ్యాసకుల వినతిపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 11వ తేదీన జోనల్ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులతో కలిసి పీజేఆర్ స్టేడియాన్ని సందర్శిస్తానని తెలిపారు. యోగాభ్యాసకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యోగాభ్యాసకులు ఎమ్మెల్యే గాంధీని సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో చందానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి రఘునాథ్ రెడ్డి, యోగాభ్యాసకులు అప్పలనాయుడు, శ్రీనివాసరావు, మహిపాల్ రెడ్డి, పద్మ, సింహాచలం, సురేష్, శంకర్ పటేల్, వెంకటేశ్వరరావు, జ్ఞానేశ్వర్, బాల నాగరాజు, వెంకట్, మంజుల, రేవతి, రమ్య, లీలావతి, చైత్ర తదితరులు పాల్గొన్నారు.





