పాపారాయుడు నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మూడు కంపెనీలు దగ్ధం..

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని పాపారాయుడు నగర్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాలనీలోని పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు పక్కనే ఉన్న GRB Ghee, Haldiram గోడౌన్లకు వ్యాపించాయి. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో సమీపంలోని పలు గోదాములు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సహాయక చర్యల్లో పాల్గొని బాధితులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో ప్రారంభమైన మంటలు పక్కనే ఉన్న GRB Ghee, Haldiram గోడౌన్లకు వ్యాపించాయని తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు కంపెనీలు పూర్తిగా దగ్ధమయ్యాయని, నాలుగు టాటా ఏస్ వాహనాలు పూర్తిగా కాలిపోయాయని వెల్లడించారు. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయని, అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. జనావాసాల మధ్య గోదాములు ఉండటం ఆందోళనకరమని, ఇలాంటి ఘటనలు తీవ్రంగా కలచివేస్తాయని గాంధీ అన్నారు. నివాస ప్రాంతాలకు దూరంగా గోదాములను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రమాదం అందరికీ ఒక గుణపాఠం కావాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గోదాముల నిర్వాహకులు తప్పనిసరిగా అగ్నిమాపక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందని గాంధీ పేర్కొన్నారు. భారీగా ఆస్తినష్టం జరగడం బాధాకరమని, నష్టాన్ని పూర్తిగా పూడ్చలేమని అన్నారు. ప్రతి ఒక్కరూ అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కోరారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటానని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, చంద్రారెడ్డి, నాగేశ్వర్ రావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here