శేరిలింగంపల్లి, నవంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): దీపావళి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రాంగణంలో సదర్ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు యాదవ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, యాదవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, రాష్ట్ర యాదవ కురుమ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు మారబోయిన రాజు యాదవ్, గోధ నరేందర్ యాదవ్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. యాదవుల ఆత్మగౌరవానికి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో దున్నపోతుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ ప్రాంతాల నుంచి యాదవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, యాదవుల సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ పండుగను ఘనంగా నిర్వహించిన అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. యాదవులు ఎంతో శ్రమించి పెంచిన దున్నపోతులను ఈ వేదికపై ప్రదర్శించడం గర్వకారణమని పేర్కొన్నారు. యాదవుల ఐక్యతను చాటిచెప్పే సదర్ ఉత్సవాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి, సదర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యనారాయణ, రవీంద్ర చారీ, రాజు తదితరులు పాల్గొన్నారు.





