శేరిలింగంపల్లి, నవంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్లో రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల రెవెన్యూ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ ఈటల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలు, రెవెన్యూ సెక్రటరీ లోకేశ్ కుమార్, మూడు జిల్లాల కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హాజరై నియోజకవర్గంలోని పలు భూ సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

మియాపూర్ సర్వే నంబర్ 100 భూములపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రశాంత్ నగర్ కాలనీ నివాసితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని గాంధీ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న అమాయక కుటుంబాల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని, న్యాయస్థానం తీర్పును గౌరవిస్తూనే బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. అలాగే ఎల్లమ్మబండ సర్వే నంబర్ 336లో సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని పరిరక్షించడంతో పాటు వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పేద విద్యార్థుల కోసం కేటాయించిన నాలుగు ఎకరాల స్థలంలో పాఠశాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు.
నానక్రామ్గూడ సర్వే నంబర్ 49లో జరిగిన అక్రమ క్రమబద్ధీకరణపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గాంధీ డిమాండ్ చేశారు. గోపన్పల్లి సర్వే నంబర్ 262, సర్వే నంబర్ 24 పరిధిలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమ భూ లావాదేవీలపై విచారణ జరిపి ప్రభుత్వ భూములను కాపాడాలని, వాటిని ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని మంత్రులు, కలెక్టర్లను కోరారు.
అదేవిధంగా 22A నిషేధిత జాబితాలో చేర్చిన కాలనీల సమస్యలను పరిష్కరించి నివాసితులకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, ఎన్ఓసీలు జారీ చేయడంతో పాటు కొన్ని రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయని, ప్రస్తుతం ఆయా ప్రాంతాలను 22A జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. శేరిలింగంపల్లి మండలంలోని గోకుల్ ప్లాట్స్, ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్మెంట్స్, మహేంద్ర అశ్విత, సైప్రస్ ఫార్మ్స్ విల్లాస్, అయ్యప్ప సొసైటీ, రాజరాజేశ్వరి నగర్, గోల్డెన్ తులిప్, KMR ఎస్టేట్, మాధవ హిల్స్, ఓయూ ప్రొఫెసర్స్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్ నగర్ A, B, C బ్లాక్, ప్రశాంత్ నగర్, ఆనంద్ నగర్, హనుమాన్ నగర్, జూబ్లీ ఎన్క్లేవ్, శారదా నగర్, జయభేరి ఎన్క్లేవ్, KSR ఎన్క్లేవ్, శంకర్ నగర్, భవానీపురం వీకర్ సెక్షన్, ప్రశాంతి హిల్స్, సురభి కాలనీలతో పాటు కూకట్పల్లి మండలంలోని ఆస్బెస్టాస్ కాలనీ, పాపిరెడ్డినగర్, ఆల్విన్ కాలనీ, కమల ప్రసన్న నగర్, శంషిగూడ, ఇందిరా హిల్స్, HMT శాతవాహన నగర్, రామ్ నరేష్ నగర్, మిత్ర హిల్స్, అడ్డగుట్ట, భాగ్యనగర్ కాలనీలను 22A జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేయాలని కోరారు.
గాంధీ ప్రస్తావించిన అంశాలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. 22A జాబితా కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని, ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.





