శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): గంగారం ప్రాంతంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వాటిని తక్షణమే నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో చందానగర్ సర్కిల్-21 అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు సదుపాయం సరిగా లేని ప్రాంతంలో, ఎలాంటి సెట్బ్యాక్లు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. బిల్డర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెబుతున్న అధికారులు, నిర్మాణ పనులను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. పోలీసుల సహకారంతో బిల్డర్ రవిని అదుపులోకి తీసుకుని అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరారు.

ఈ నిర్మాణాల వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భాస్కరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం సంభవిస్తే కనీసం ఫైర్ ఇంజన్ కూడా ఘటనాస్థలికి చేరుకోలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. సరైన అనుమతులు లేకపోవడంతో పాటు, కోర్టు ఆదేశాలు కూడా నిర్మాణ పనులను కొనసాగించేందుకు అనుకూలంగా లేవని స్పష్టం చేశారు. నిర్మాణం చివరి స్లాబ్ వేయడానికి సిద్ధం చేసినప్పటికీ, స్టేటస్ కో (యథాతథ స్థితి) అమల్లో ఉన్న సమయంలో మొదటి, రెండో అంతస్తుల్లో పనులు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ పరిణామాలపై సర్కిల్-21 అధికారులు మౌనం వహించడం వారి వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డిప్యూటీ కమిషనర్‌పై ఉందని పేర్కొంటూ, తక్షణమే నిర్మాణ పనులను నిలిపివేసి స్టేటస్ కో అమలయ్యేలా చూడాలని జనం కోసం తరఫున కసిరెడ్డి భాస్కరరెడ్డి కోరారు. బాధ్యతలు నిర్వర్తించలేని అధికారులు తమ పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.





