శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ సాయిరాం నగర్ కాలనీకి చెందిన పలువురు నివాసితులు కాలనీలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. కాలనీ వాసుల వినతిపై శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే శ్రీ సాయిరాం నగర్ కాలనీలో స్వయంగా పర్యటించి సమస్యలను పరిశీలిస్తానని, విడతల వారీగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. కాలనీల నుంచి వస్తున్న వినతులు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని, PAC చైర్మన్ అరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవతో డివిజన్లో అత్యవసరమైన, నిత్యం సమస్యలు ఎదురవుతున్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

ఏ చిన్న సమస్య తన దృష్టికి వచ్చినా పరిష్కరించేందుకు కృషి చేస్తానని, శ్రీ సాయిరాం నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచిస్తామని తెలిపారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, కాలనీల్లో స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన ప్రజా జీవనానికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఉమ్మడి మియాపూర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయిరాం నగర్ కాలనీ వాసులు మహమ్మద్ షా, భాస్కర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సత్యనారాయణ, శామీర్, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





