శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): టీఆర్‌ఎస్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి వాసిలి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరినట్లు కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని సీపీఐ(ఎం) శేరిలింగంపల్లి జోన్ కమిటీ ఖండించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఇతర పార్టీల్లో చేరే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆశయాలు, సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న సీపీఐ(ఎం)కు చెందిన ఏ ఒక్క నాయకుడు లేదా కార్యకర్త కూడా పార్టీని వీడలేదని పేర్కొన్నారు.

సీపీఐ(ఎం)కు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరినట్లు వార్తలు ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని, పత్రికా ప్రకటనలు విడుదల చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జోన్ కమిటీ సూచించింది. ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో సీపీఐ(ఎం) శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి సి. శోభన్, జోన్ కమిటీ సభ్యులు వి. మాణిక్యం, కె. కృష్ణ, ఎం. శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.





