ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: సీపీఐ నేత టి. రామకృష్ణ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో ఏఐటీయూసీ బలపరిచిన ఆర్టీసీ కూటమి సభ్యులకు కార్మికులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుతూ ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని రామకృష్ణ అన్నారు. కార్మికులకు న్యాయమైన వేతనాలు, పెండింగ్ బకాయిల చెల్లింపు, పీఆర్సీ అమలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సిబ్బంది కొరతను నివారించి పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు మెరుగైన వైద్య భద్రత కల్పించేందుకు ప్రతి కార్మికుడికి రూ.50 లక్షల హాస్పిటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని రామకృష్ణ కోరారు. కార్మికుల పిల్లల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించే విధంగా ప్రత్యేక విద్యా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి ఆర్టీసీ కార్మికుడికి సొంత ఇంటి సౌకర్యం కల్పించేలా ప్రత్యేక గృహ పథకాన్ని అమలు చేసి కార్మిక కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు కార్మికులకు ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు, సంక్షేమ ప్రయోజనాలు అందించడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించే అవకాశం ఉంటుందని రామకృష్ణ పేర్కొన్నారు.

కార్మికుల సమస్యలను యాజమాన్యం, ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో సంఘటిత పోరాటాలు నిర్వహించే విధంగా కార్మిక సంఘాలు బలోపేతం కావాలని అన్నారు. ఆర్టీసీ కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, కుటుంబ సంక్షేమం, పిల్లల భవిష్యత్తు, సొంత ఇల్లు, మెరుగైన వైద్యం కోసం కార్మికులు ఐక్యంగా నిలవాలని, ఏఐటీయూసీ బలపరిచిన ఆర్టీసీ కూటమి సభ్యులకు మద్దతు ఇవ్వాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే. చందు యాదవ్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి తుపాకుల రాములు, డీహెచ్‌పీఎస్ మండల కార్యదర్శి ఎస్. కొండలయ్య పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here