శేరిలింగంపల్లి, అక్టోబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): మయూరి నగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అధికారులను కోరారు. మయూరి నగర్ కాలనీలోని రాక్ గార్డెన్లో నిర్వహించిన వన్ డే.. వన్ వార్డ్ రివ్యూ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డీసీ బాలకృష్ణ, CMCకు చెందిన వివిధ విభాగాల అధికారులు, కాలనీల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి డివిజన్లోని సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. కాలనీల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సమన్వయంతో పనిచేస్తే సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని అన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ, తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, వర్షపు నీటి పారుదల, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి, మౌలిక వసతులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. డివిజన్లో పెరుగుతున్న జనాభా, కొత్తగా అభివృద్ధి చెందుతున్న కాలనీలకు అనుగుణంగా మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని సూచించారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో మయూరి నగర్ డివిజన్ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంపై అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామని శ్రీకాంత్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో CMCకు చెందిన వివిధ విభాగాల అధికారులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.





