పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి: భేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తరతరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, బీసీల హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, రాబోయే ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అధిక శాతం సీట్లు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. బీసీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబద్ధతతో వ్యవహరించాలని కోరారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలను పరిష్కరించేందుకు రాష్ట్ర, కేంద్ర మంత్రులు ముందుకు రావాలని అన్నారు. దేశంలో బీసీ జనాభా అధికంగా ఉన్నందున, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కష్టం ఒకరిది.. పెత్తనం ఇంకొకరిది అన్న చందంగా ప్రభుత్వాల పరిపాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. బీసీ కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి జీవన పరిస్థితులను పరిశీలిస్తే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అర్థమవుతాయని అన్నారు. ఇకపై బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఓట్ల కోసం బీసీ ప్రజలు అవసరమవుతున్నారని, అయితే అర్హత ఉన్న బీసీ నాయకత్వానికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఆయన అన్నారు. మా నాయకత్వం మాకు కావాలి.. మా హక్కులు మేము సాధించుకోవాలి అని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే జనాభా ప్రాతిపదికన 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ బిల్లు తీసుకురావాలని భేరి రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన బీసీ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here