శేరిలింగంపల్లిలో ఇందిరమ్మ టవర్స్‌కు శ్రీకారం.. ఏడాదిలోనే పేదల గృహప్రవేశాలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గం విలేజ్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మల్కం చెరువు వెనుక 2.85 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు హౌసింగ్, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, MLC బోగారపు దయానంద్ గుప్తా, యాదవ కో-ఆపరేటివ్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, అదనపు కలెక్టర్ కిరణ్మయి, హౌసింగ్ PD నాయక్, RDO శ్రీధర్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం సంతోషంగా ఉందన్నారు. ఏడాది కాలంలో ప్రాజెక్టును పూర్తి చేసి లబ్ధిదారులకు గృహప్రవేశాలు జరిగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులో ఫేజ్-1 కింద 480 ఇళ్లు, ఫేజ్-2 కింద 680 ఇళ్లను నిర్మించనున్నట్లు గాంధీ తెలిపారు. ఫేజ్-1లో నాలుగు టవర్లు నిర్మించనుండగా, ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్లు ఉంటాయని చెప్పారు. ఒక్కో ఫ్లోర్‌లో 12 ఫ్లాట్ల చొప్పున నిర్మాణం చేపడతామని వివరించారు. ఒక్కో ఫ్లాట్ సుమారు 525 నుంచి 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో, బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో కూడిన సౌకర్యవంతమైన గృహంగా ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఈ ఇళ్లలో లబ్ధిదారుడి పేరుతో అన్‌డివైడెడ్ షేర్ కింద సుమారు 20 నుంచి 25 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు గాంధీ తెలిపారు. లబ్ధిదారుడి వాటాగా రూ.6 లక్షలు, ప్రభుత్వ సబ్సిడీగా రూ.5 లక్షలు ఉంటాయని చెప్పారు. భూమిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. రాయదుర్గం ప్రాంతంలో భూముల ధరలు భారీగా ఉన్న నేపథ్యంలో నగరంలోనే పేదలకు సొంత ఇల్లు అందుబాటులోకి రావడం కీలకమని పేర్కొన్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు దగ్గరగా గౌరవప్రదమైన నివాసం లభించేలా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. ఆటో రిక్షాలు, ట్యాక్సీలు నడుపుతూ జీవనం సాగిస్తున్న వారిని కూడా అర్హులైన లబ్ధిదారులుగా పరిగణించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు గాంధీ తెలిపారు. నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్న కారణంగా వారు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోకూడదని కోరినట్లు చెప్పారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి ట్యాక్సీ డ్రైవర్లకు కూడా అవకాశం కల్పిస్తామని తెలిపారని వెల్లడించారు.

ఇందిరమ్మ టవర్స్ ఇళ్లను అర్హులైన పేదలకు పారదర్శకంగా లక్కీడ్రా విధానంలో కేటాయించనున్నట్లు గాంధీ తెలిపారు. ఇటీవల లక్కీడ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఆధునిక ప్రమాణాలతో, సౌకర్యవంతంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో భూముల ధరలు భారీగా పెరుగుతున్న పరిస్థితుల్లో నగరంలోనే పేదలకు సొంతింటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని గాంధీ అన్నారు. హైదరాబాద్ గృహ నిర్మాణ రంగంలో ఈ ప్రాజెక్టు కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here