గణేష్ ఉత్సవాల పూల వ్యర్థాలకు కొత్త జీవితం.. సీఎంసీ వినూత్న ప్రణాళిక

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గణేష్ ఉత్సవాల సందర్భంగా భారీగా ఉత్పత్తి అయ్యే పూల వ్యర్థాలను సుస్థిరంగా నిర్వహించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చర్యలు చేపడుతోంది. పండుగ అనంతరం వ్యర్థాలుగా మారే పూలను సేకరించి, వాటితో అగరబత్తీలు, ధూపాలు, దీపాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు పూల వ్యర్థాలను సర్క్యులర్ ఎకానమీ విధానంలో నిర్వహించే అంశంపై పక్కా ఆర్గానిక్స్ సంస్థ ప్రతినిధులతో సీఎంసీ సమావేశం నిర్వహించింది. ఉత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించే పూలను నిమజ్జనం అనంతరం సాధారణ వ్యర్థాల్లో కలవకుండా ప్రత్యేకంగా సేకరించి, వాటిని పునర్వినియోగం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు పేర్కొన్నారు.

తొలిదశలో సీఎంసీ పరిధిలోని నిమజ్జన కేంద్రాల్లో, ముఖ్యంగా ఐడీఎల్ సరస్సు వద్ద ప్రత్యేక పూల సేకరణ కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సేకరించిన పూలను ఇతర వ్యర్థాల నుంచి వేరు చేసి, ఎండబెట్టి, ప్రత్యేక ప్రాసెసింగ్ ద్వారా అగరబత్తీలు, ధూపాలు, దీపాలు వంటి ఉత్పత్తులుగా మార్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు పూల వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్ టెక్నాలజీ, సర్క్యులర్ ఎకానమీ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్‌జీఓలు, స్టార్టప్‌లు, ఇతర సంస్థలు సీఎంసీతో భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తోంది. వినూత్న ఆలోచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాసెసింగ్ సామర్థ్యాలను వినియోగించుకుని ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో సైబరాబాద్ వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని సీఎంసీ భావిస్తోంది.

పండుగల సందర్భంగా ఉత్పత్తయ్యే వ్యర్థాలను తగ్గించడం, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం, వనరుల పునర్వినియోగం ద్వారా సుస్థిర పండుగల నిర్వహణకు దోహదపడటమే లక్ష్యంగా సీఎంసీ ఈ చర్యలకు శ్రీకారం చుడుతోంది. భక్తితో సమర్పించిన పూలకు నిమజ్జనం తర్వాత కూడా ప్రయోజనకరమైన కొత్త రూపాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here