శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగబద్ధమైన ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ శాసనసభా పక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శేరిలింగంపల్లి బీజేపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆశీస్సుల దీపం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్థానిక దేవాలయాల్లో దీపాలు వెలిగించడంతో పాటు ప్రతి ఇంట్లోనూ ఆశీస్సుల దీపాలు వెలిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అదే రోజు రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు ఆంగన్ మిలన్ సేవ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 25న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛత కార్యక్రమాలతో పాటు ఖాదీ, స్వదేశీ ఉత్పత్తులపై ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 7న సేవా జ్యోతి కలశ యాత్ర, అక్టోబర్ 17న సేవా సంకల్ప్ అభియాన్ ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ నెల రోజుల పాటు జరిగే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజలను భాగస్వాములను చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంత్ నాయక్, రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజిత్, రాష్ట్ర నాయకులు పుల్లారావు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, కార్యదర్శులు అనిల్ గౌడ్, మాణిక్ రావు, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, డివిజన్ అధ్యక్షుడు కిషన్ గౌలి, సీనియర్ నాయకుడు ఓబుల్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు అమర్ యాదవ్, నాయకులు అనంత రెడ్డి, అమని, శివ, ధరణి తదితరులు పాల్గొన్నారు.





