శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): చట్టం, టెక్నాలజీ సమన్వయంతోనే భవిష్యత్ న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేపల్లి నందా అన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో మంగళవారం నిర్వహించిన 15వ వార్షిక లీగల్ ఎరా ఇండియా కాన్‌క్లేవ్ 2026లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. చట్టం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక వసతులు–కార్పొరేట్ నాయకత్వం అంశంపై ఆమె మాట్లాడుతూ.. న్యాయ రంగంతో పాటు కోర్టులు, వ్యాపార సంస్థలు, సమాజంపై టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వేగంగా పెరుగుతోందన్నారు. టెక్నాలజీ సహాయంతో కోర్టులు తమ రాజ్యాంగబద్ధ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తించగలవని పేర్కొన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యాయమూర్తుల నిర్ణయ ప్రక్రియకు సహాయకంగా ఉపయోగపడగలదని జస్టిస్ నందా తెలిపారు. అయితే న్యాయమూర్తి మనస్సాక్షి, న్యాయ విచక్షణ, మానవీయ ఆలోచనా విధానాన్ని ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. టెక్నాలజీ అభివృద్ధిని కేవలం పనితీరు, వేగం ఆధారంగా అంచనా వేయకూడదని ఆమె అన్నారు. న్యాయం సామాన్య ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చిందా, అందుబాటు ఖర్చులో లభిస్తుందా, సులభంగా అర్థమయ్యేలా మారిందా అనే అంశాల ఆధారంగా టెక్నాలజీ ఫలితాలను అంచనా వేయాలని సూచించారు. భవిష్యత్‌లో టెక్నో-లీగల్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ మరింత పెరుగుతుందని జస్టిస్ నందా అన్నారు. ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్, టెక్నాలజీ నియంత్రణ వంటి కొత్త రంగాలపై న్యాయవాదులకు అవగాహన అవసరమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ కృష్ణ గ్రంధి, మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ లీగల్ ఆఫీసర్ ఇషా సిన్హా, క్వాల్‌కామ్‌కు చెందిన నితిన్ శర్మ, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ దివ్య అడెపు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సైయెంట్, అపోలో హాస్పిటల్స్ తదితర సంస్థలకు చెందిన సీనియర్ లీగల్ హెడ్‌లు, ఇన్-హౌస్ లీగల్ ప్రొఫెషనల్స్ కూడా హాజరయ్యారు.





