శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని శ్రీరామ్‌నగర్ డివిజన్‌లో అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త మిద్దెల మల్లారెడ్డి శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. డీఎల్‌ఎఫ్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ప్లాట్ నంబర్ 99/B పక్కన నిర్మిస్తున్న భవనానికి మూడు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని, ఏడు అంతస్తులు నిర్మించారని ఆయన ఆరోపించారు. భవనానికి కనీసం సెట్‌బ్యాక్ కూడా లేకుండా, సెల్లార్‌తో సహా నిర్మాణం చేపట్టినట్లు మల్లారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం భవనంపై House For Sale బోర్డు ఏర్పాటు చేసి విక్రయానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్మాణంపై గతంలోనూ పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.

అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై అధికారులు తరువాత చర్యలు తీసుకుంటే, వాటిని కొనుగోలు చేసిన అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బిల్డర్లు మాత్రం ప్రజల నుంచి డబ్బులు తీసుకుని తప్పించుకునే పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే భవనాన్ని పరిశీలించి, నిర్మాణం అక్రమమని తేలితే సీజ్ చేయాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. భవనానికి విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించకుండా సంబంధిత శాఖలకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే భవన విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి కూడా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్మాణానికి సంబంధించి ప్రవీణ్, కాసయ్య, సుధాకర్ అనే వ్యక్తులు బిల్డర్లుగా ఉన్నారని మల్లారెడ్డి తెలిపారు. వారికి వెంటనే నోటీసులు జారీ చేసి, నిర్మాణంపై సమగ్ర విచారణ చేపట్టి ప్రజల ప్రయోజనాలను కాపాడాలని ఆయన కోరారు.





