శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని రామ్ నరేష్ నగర్ కాలనీకి చెందిన గజ్జ హేమ, నరేందర్ రెడ్డి దంపతులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన రూ.1,00,116 ఆర్థిక సహాయాన్ని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా నిలుస్తున్నారని, పేదింటి ఆడబిడ్డలకు పెద్ద అన్నలా అండగా ఉంటున్నారని అన్నారు.

నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గాంధీ సూచించారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు సంతోషంగా జరగడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతుల రాజేందర్, శ్రీధర్ రెడ్డి, యాసిన్, దేవేందర్ రెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.





