మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలకు నిరసన.. కళ్లకు గంతలు కట్టుకున్న మహిళలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అసెంబ్లీలో సీనియర్ మహిళా శాసనసభ్యులు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ చందానగర్‌లో మహిళలు వినూత్న ఆందోళన చేపట్టారు. మంగళవారం చందానగర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ నాయకురాలు బొబ్బా నవతారెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. న్యాయం గుడ్డిది కాదు అనే సందేశాన్ని చాటేలా మహిళలు కళ్లకు నల్లని గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల అసెంబ్లీలో జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా బొబ్బా నవతారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సీనియర్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి అసెంబ్లీలో చులకనగా మాట్లాడటం హేయమైన చర్య అని విమర్శించారు. ఇది కేవలం ఆ ఇద్దరు నేతలకు జరిగిన అవమానం కాదని, తెలంగాణ మహిళా లోకానికి జరిగిన అవమానమని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి సహనంతో సమాధానం చెప్పాల్సి ఉండగా, వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని ఆమె మండిపడ్డారు. మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న గౌరవం సీఎం వ్యవహారశైలితో బయటపడిందని ఆరోపించారు. మహిళలు కళ్లకు గంతలు కట్టుకుని వ్యక్తం చేస్తున్న ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నవతారెడ్డి అన్నారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలతో పాటు తెలంగాణ మహిళలందరికీ సీఎం రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మహిళలను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, శబానా, శరీన్, శోభ, రాధతో పాటు సీనియర్ నాయకులు కోమండ్ల శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్, సంగారెడ్డి, రాజన్న, రామకృష్ణగౌడ్, అల్లావుద్దీన్, శివరాజ్, చందర్‌రావు, గౌస్, అంజి, శేఖర్ తదితరులు, స్థానిక మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here