సేవా రత్న అవార్డుతో బేరి రామచందర్ యాదవ్‌కు ఘన సత్కారం

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీసీ కులాల ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్‌కు సేవా రత్న అవార్డు లభించింది. శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన హాలులో నిర్వహించిన స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. సంస్థ నిర్వాహకుడు బి. నాగేంద్ర యాదవ్, కార్యక్రమ ఇన్‌ఛార్జ్ బి. దివ్యలక్ష్మి చేతుల మీదుగా బేరి రామచందర్ యాదవ్ అవార్డును స్వీకరించారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, వాద్య సంగీతం, నృత్య కళలకు వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి సత్కరించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. బేరి రామచందర్ యాదవ్ తన తల్లిదండ్రులైన బేరి వెంకటమ్మ, వెంకటయ్య పేర్లతో మెమోరియల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. యువత మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా క్రీడలపై ఆసక్తి పెంచేందుకు ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లోనూ ఆయన చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. పేద విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందించడంతోపాటు, యువత క్రీడల్లో రాణించేందుకు క్రికెట్, వాలీబాల్, చెస్ తదితర క్రీడా సామగ్రిని ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారని నాగేంద్ర యాదవ్ గుర్తుచేశారు. ఇలాంటి సేవలను గుర్తించి సేవా రత్న అవార్డుతో సత్కరించడం తమకు గర్వకారణమన్నారు.

అనంతరం అవార్డు గ్రహీత బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ తనను సేవా రత్న అవార్డుతో సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందుకోవడం ప్రత్యేకంగా భావిస్తున్నానని తెలిపారు. తన సేవలను గుర్తించి సత్కరించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచబోయిన సురేష్ యాదవ్, యాదగిరిగుట్ట దేవస్థానం డైరెక్టర్ల బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంటాల జంగయ్య, ప్రజాపతి రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త డాక్టర్ వీరభోగ వసంతరాయలు, మునుగోడు నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మారమోని శ్రీశైలం యాదవ్, రాజారావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here