సర్వే నంబర్‌ 151లో 2023లో ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి: జనం కోసం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్‌ దీప్తిశ్రీనగర్‌లోని సర్వే నంబర్‌ 151 సర్కారీ చెరువు శిఖం భూమిలో 2023లో ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ నారాయణ్‌ అమిత్ ను కలిసి, సర్వే నంబర్‌ 151ను సర్వే నంబర్‌ 150 పట్టా భూమిగా చూపిస్తూ అప్పటి అధికారులు అనుమతులు ఇచ్చారంటూ ఆరోపించారు. ఈ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌, తహసీల్దార్‌ రాసిన లేఖను జోనల్‌ కమిషనర్‌కు స్వయంగా అందజేశారు.

ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా భాస్కరరెడ్డి కోరారు. దీనిపై స్పందించిన జోనల్‌ కమిషనర్‌.. పూర్తి వివరాలను సర్కిల్‌-48 డిప్యూటీ కమిషనర్‌ నుంచి తెప్పించుకుని, పరిశీలించిన అనంతరం అనుమతుల రద్దుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ శాఖ నుంచి సరైన నిరభ్యంతర పత్రం (NOC) లేకుండానే ప్రభుత్వ భూమిలో అనుమతులు ఇచ్చిన సంబంధిత అధికారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్‌ చేశారు. అవినీతికి పాల్పడి ప్రభుత్వ భూమిలో అనుమతులు మంజూరు చేయడం క్షమించరాని నేరమని ఆయన పేర్కొన్నారు. జోనల్‌ కార్యాలయంపై గతంలో పలుమార్లు ఏసీబీ దాడులు జరిగి అధికారులు పట్టుబడినప్పటికీ, ఇతర అధికారుల్లో భయం కనిపించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. అధికారంలో ఉన్నవారు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని భాస్కరరెడ్డి విమర్శించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here