శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): స్వర మహతి కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సృజనోత్సవ్ 2026 కళ, సాహిత్యం, సంగీతం, నృత్యం, సృజనాత్మక ప్రతిభల సమ్మేళనంగా ఘనవిజయం సాధించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పోటీలకు విద్యార్థులు, కళాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. వందలాది మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్యాండిడస్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో ఆఫ్‌లైన్ పోటీలు విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కళల ద్వారా జాతీయ సమైక్యత సాధ్యమవుతుందని అన్నారు. దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడటంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని, సంగీతం, నృత్యం, సాహిత్యం ద్వారా ప్రజలంతా ఒకే బంధంతో అనుసంధానమవుతారని పేర్కొన్నారు.

సుమన్ టీవీకి చెందిన కేశవ్ మాట్లాడుతూ.. కళలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, సమాజ మార్పుకు అవి శక్తివంతమైన సాధనాలని అన్నారు. సృజనోత్సవ్ వంటి వేదికలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు భవిష్యత్ నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు. ఈ.వి. శ్రీనివాసరావు (IRCS తెలంగాణ రాష్ట్ర MC & TPCC GS) మాట్లాడుతూ.. కళలకు సరిహద్దులు లేవని, భిన్నత్వంలో ఏకత్వానికి అవి ప్రతీకలని అన్నారు. సృజనోత్సవ్ ఈ భావనకు నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రసంగించిన అతిథులు విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ.. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని ఆకాంక్షించారు.

స్వర మహతి కళాపరిషత్ అధ్యక్షుడు డా. బందనపూడి ఆదిత్య కిరణ్ స్వాగత ప్రసంగం చేశారు. సృజనోత్సవ్ నిర్వహణకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వం, భాషా, సాంస్కృతిక శాఖతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రమదుర్గం నగేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాండిడస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ చైర్మన్ భాస్కర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మియాపూర్ ప్రిన్సిపల్ రైనా భట్టు, కేదార్నాథ్, డా. శ్రీనివాస వరప్రసాద్, సంజీవులు, మంద మహేష్, తేజ, టీవీకే చంద్ర, దేవులపల్లి కుమార్, తులసి, దేవులపల్లి మనస్విని, వైభవి, వైవీవీఎస్ లక్ష్మణ్ కుమార్, సినీ రచయిత, దర్శకుడు మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. యువతలోని కళా, సృజనాత్మక ప్రతిభను వెలికితీస్తూ.. కళా సంస్కృతిని సమాజంలో విస్తరింపజేసిన వేదికగా సృజనోత్సవ్ 2026 నిలిచింది.





