శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై PAC చైర్మన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డీసీలు సేవా ఇస్లావత్, శ్రీనివాస్‌తో పాటు CMC ఇంజనీరింగ్, ప్రాజెక్ట్స్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, UBD విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని సమగ్ర, సంతులిత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు నిబద్ధతతో పనిచేయాలని కోరారు.

రోడ్లు, UGD, వరద నీటి కాల్వలు, పార్కులు, శ్మశాన వాటికలకు సంబంధించిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని గాంధీ ఆదేశించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ప్రజా అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. టెండర్లు పూర్తయిన పనులకు త్వరలోనే శంకుస్థాపనలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అసంపూర్తిగా ఉన్న నాలాల విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని గాంధీ సూచించారు. నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. సమస్యలు తలెత్తినప్పుడు తక్షణమే స్పందించేలా శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు.

ఆరోగ్య శేరిలింగంపల్లి లక్ష్యంగా అధికారులు, ప్రజలు కలిసి పనిచేయాలని గాంధీ అన్నారు. పార్కులను సుందర వనాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. పార్కుల్లో మౌలిక వసతులతో పాటు పిల్లలకు ఆటవిడుపు పరికరాలు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో నిత్యం నెలకొంటున్న ట్రాఫిక్ రద్దీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గాంధీ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రహదారులు, లింక్ రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ పనులు చేపట్టి ట్రాఫిక్ సమస్యను తగ్గించే చర్యలు తీసుకోవాలని, టౌన్ ప్లానింగ్, CMC ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
శేరిలింగంపల్లిలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని గాంధీ అన్నారు. PJR స్టేడియాన్ని అన్ని హంగులు, సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. స్టేడియం అభివృద్ధికి సుమారు రూ.10 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో క్రీడాకారులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి స్టేడియాన్ని వారికి వరంగా మార్చాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో AMC ప్రేమ్ కుమార్, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE శిరీష, EE వశిధర్, DE ఆనంద్, DE శ్రీదేవి, AEలు ప్రశాంత్, ప్రతాప్, భాస్కర్, రషీద్, ప్రాజెక్ట్స్ DE శిరీష, AE శివకృష్ణ, టౌన్ ప్లానింగ్ అధికారులు ACP సురేందర్, TPS అక్బర్, TPS సుష్మ, UBD డైరెక్టర్ అమృత, UBD మేనేజర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.





