శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (నమస్తే శేరిలింగంపల్లి): గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ సూచించారు. సెప్టెంబర్ 14 నుంచి 25వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు అధికారులతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆడిటోరియంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

గత ఏడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమారు 25 వేల గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గతేడాది ఎదురైన సమస్యలు, ఈ ఏడాది చేపట్టాల్సిన భద్రత, ట్రాఫిక్, మౌలిక వసతులు, నిమజ్జన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అన్నారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనం తేదీ, ఊరేగింపు తదితర వివరాలను నిర్వాహకులు ముందుగానే స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ప్రాంతాల్లో విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు.

ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, అవసరమైన సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో భద్రత, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడంతో పాటు నిమజ్జన మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, అడ్డంకుల తొలగింపు, బ్యారికేడింగ్, లైటింగ్, పార్కింగ్, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజలు, మండపాల నిర్వాహకులు పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన మాట్లాడుతూ.. సీఎంసీ పరిధిలోని మూడు జోన్ల అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. ఊరేగింపు, నిమజ్జన మార్గాలను ముందుగానే పరిశీలించి పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రోడ్లపై గుంతల మరమ్మతులు, లైటింగ్, డ్రైనేజీ సిల్టింగ్, అవసరమైన చోట జనరేటర్ల ఏర్పాటు, ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు వంటి పనులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. నిమజ్జన ప్రాంతాల్లో తాత్కాలిక పారిశుద్ధ్య బృందాలను ఏర్పాటు చేసి పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.
సైబరాబాద్ జాయింట్ సీపీ–ట్రాఫిక్ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడతామని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పరిస్థితులను పరిశీలిస్తారని, భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులు చేపడతామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. ఇంద్రేశం, ఇస్నాపూర్‌తో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవ రెడ్డి మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులను కోరారు. గతంలో ఎదురైన సమస్యలను పరిష్కరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. సమితి సభ్యులు గతంలో ఎదురైన సమస్యలు, అవసరమైన ఏర్పాట్లను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిపై శాఖల వారీగా సమన్వయం చేసుకుని సకాలంలో చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
సమావేశంలో సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, జాయింట్ సీపీ–ట్రాఫిక్ సన్‌ప్రీత్ సింగ్, సీఎంసీ కమిషనర్ సృజన, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుడు మహిపాల్ రెడ్డి, అధ్యక్షుడు రాఘవ రెడ్డి, కార్యదర్శి శశిధర్, కమిటీ సభ్యులు రామరాజు, రమేష్, భాస్కర్, జీవన్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





