ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: బీఎంఎస్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణలో ఆటో, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న బంద్, సమ్మెకు మద్దతుగా భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మండల కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్లపూడి సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం మండల రెవెన్యూ అధికారుల ద్వారా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కర్లపూడి సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం గతంలో ఆటో, ట్యాక్సీ, స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న సమ్మెకు బీఎంఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

ఆటో డ్రైవర్లు ప్రతిరోజూ ప్రజలకు రవాణా సేవలు అందిస్తున్నప్పటికీ వారి జీవన పరిస్థితులు రోజురోజుకూ దుర్భరంగా మారుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల పెరుగుదలతోపాటు వాహనాల నిర్వహణ, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పర్మిట్లు, పన్నులు, ఫైనాన్స్ వాయిదాల భారం పెరిగిందన్నారు. దీంతో డ్రైవర్ల ఆదాయంలో అధిక భాగం ఖర్చులకే వెళ్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నదని సత్యనారాయణ అన్నారు. దీనికితోడు ఆర్టీసీలో ఈవీ ఆటోల విధానాన్ని ప్రతిపాదించడం అన్యాయమని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా బీఎంఎస్ ప‌లు ప్ర‌ధాన డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ముందు ఉంచింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12వేల ఆర్థిక సహాయం వెంటనే అందించాలి. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైన డ్రైవర్ల కుటుంబాలకు మెరుగైన ప్రమాద బీమా కల్పించాలి. డ్రైవర్లు, వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా, మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి. పిల్లల విద్య, వివాహం వంటి అవసరాలకు సంక్షేమ ఆర్థిక సహాయం అందించాలి. వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పర్మిట్, ఇతర ప్రభుత్వ రుసుములను తగ్గించాలి. ఆర్టీఏ కార్యాలయాల్లో డ్రైవర్ల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి. చిన్నచిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు అధిక జరిమానాలు విధించే విధానాన్ని పునఃపరిశీలించాలి. ఆటోలను నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలతోపాటు రెస్ట్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలి. ఆటో డ్రైవర్లపై అనవసర వేధింపులు, అక్రమ వసూళ్లను అరికట్టాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. డ్రైవర్లకు పెన్షన్, వృద్ధాప్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఆటో డ్రైవర్లు కేవలం వాహనాలు నడిపే కార్మికులు కాదని, ప్రజా రవాణా వ్యవస్థలో కీలక భాగస్వాములని కర్లపూడి సత్యనారాయణ పేర్కొన్నారు. వారి శ్రమకు తగిన గౌరవం, ఆదాయ భద్రత, సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆటో డ్రైవర్ కుటుంబం కూడా సంతోషంగా జీవించే పరిస్థితులు కల్పించాలని కోరారు. డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి పరిష్కార మార్గం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు కొనసాగుతున్న సమ్మెకు బీఎంఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు గౌస్, నరసింహ, సురేష్, యాదయ్య, ప్రవీణ్, రాజు, శ్రీనివాస్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here