శేరిలింగంపల్లి ఓటర్లకు కీలక ప్రకటన.. ముసాయిదా జాబితా విడుదల

శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఓటర్ల నమోదు నిబంధనలు 1960 ప్రకారం రూపొందించిన ఈ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రతులు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కార్యాలయం, సంబంధిత సర్కిల్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, అన్ని పోలింగ్ కేంద్రాల్లో కార్యాలయ పనివేళల్లో పరిశీలించేందుకు అందుబాటులో ఉంటాయి.

ఓటర్ల జాబితా తయారీకి 2026 అక్టోబర్ 1ను అర్హత తేదీగా నిర్ణయించారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేకపోవడం, తప్పులు ఉండటం లేదా ఇతర అభ్యంతరాలు ఉంటే 2026 సెప్టెంబర్ 16లోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకునే వారు, జాబితాలోని ఏదైనా పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయాలనుకునే వారు, అలాగే ఇప్పటికే ఉన్న వివరాల్లో మార్పులు లేదా సవరణలు కోరుకునే వారు సంబంధిత ఫారమ్-6, 6A, 7, 8లను పూర్తి చేసి సమర్పించాలి. క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సంబంధిత అధికారులకు పలు మార్గాల్లో సమర్పించే అవకాశం కల్పించారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కార్యాలయంలో నేరుగా సమర్పించవచ్చు.

సంబంధిత తహసీల్దార్లు, డిప్యూటీ కమిషనర్లు లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు అందజేయవచ్చు. నిర్ణీత పోలింగ్ కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. గడువు తేదీలోగా చేరే విధంగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అధికారిక చిరునామాకు తపాలా ద్వారా పంపించవచ్చు. ఓటర్లు ముసాయిదా జాబితాను పరిశీలించి తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా సంబంధిత ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here