శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండాపూర్, మసీద్‌బండ చౌరస్తాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతావని మువ్వన్నెల జెండా రెపరెపలతో మురిసిపోతున్న ఈ రోజు ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని స్వేచ్ఛా వాయువు పీల్చుతున్న రోజు అని పేర్కొన్నారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, వేలాది మంది వీరుల బలిదానాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు.

ఎన్నో రుధిర ధారలు ఈ నేలను ముద్దాడిన ఫలితమే స్వాతంత్ర్యమని, అహింసే అసలైన ఆయుధమని ప్రపంచానికి చాటిచెప్పిన మహాత్మా గాంధీ వంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు అర్థం చేకూర్చేలా దేశ గొప్పతనాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.





