శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మియాపూర్ నాయకుడు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మియాపూర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్‌తో కలిసి ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మియాపూర్ ప్రాంతంలో నెలకొన్న పౌర సమస్యల పరిష్కారం కోసం యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రతినిధులు నల్లగండ్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగదీశ్వర్ గౌడ్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను ఓర్పుగా విన్న ఆయన అత్యవసర అంశాలపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మిగిలిన సమస్యలను కూడా ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాకేంద్రిత పాలనతో ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం హఫీజ్‌పేట్ డివిజన్ అంబేద్కర్ నగర్‌లో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవి అమ్మవారి ఐదో వార్షిక మహోత్సవం సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నెలకొనాలని, తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా, బోనాల మహోత్సవాల సందర్భంగా మాదాపూర్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్‌లను కలిసి మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరుకావాలని ఆహ్వానించారు. ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపిన వారు ఉత్సవాల్లో పాల్గొంటామని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో కనకమామిడి నరేందర్ గౌడ్, లక్ష్మణ్ గుప్తా, పాండు ముదిరాజ్, దేవ, హేమంత్ గౌడ్, కేశవ్, శోభన్, గోపాల్, యాదగిరి, సీతారాం, రాజు, వినోద్ కుమార్, సాయినాథ్, జ్ఞానేశ్వర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





