శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మొహర్ కాలనీలో నిర్వహించిన వన్ డే – వన్ వార్డ్ కార్యక్రమంలో స్థానిక సమస్యలు, పెండింగ్ అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్, వివిధ విభాగాల అధికారులు, కాలనీల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. సమావేశంలో కాలనీవాసులు రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పార్కుల అభివృద్ధి తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వీటిని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు.

గచ్చిబౌలి వార్డ్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతోపాటు అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయాలని కమిషనర్‌ను కోరారు. ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, అసంపూర్తిగా ఉన్న నాలాల విస్తరణ పనులను వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కాలనీలో పార్కులను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలు, మహిళలు, వృద్ధులకు అనువైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామని ఆరెకపూడి గాంధీ తెలిపారు. గచ్చిబౌలి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇచ్చే అలవాటు పెంపొందించాలని, కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి కుప్పలను పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, జలమండలి విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.





