శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఉన్న పార్కులో మొక్కల సంరక్షణ, పచ్చదన పరిరక్షణకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన నూతన బోర్వెల్ను మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కులు కేవలం వినోద కేంద్రాలు మాత్రమే కాకుండా పర్యావరణ సమతుల్యత, ప్రజల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తుకు ఎంతో అవసరమని అన్నారు. పార్కుల్లో నాటిన మొక్కలను నిరంతరం సంరక్షించాలంటే నీటి వసతి అత్యంత కీలకమని, ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని బోర్వెల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ బోర్వెల్ ద్వారా పార్కులోని మొక్కలకు ఏడాది పొడవునా తగినంత నీటి సరఫరా అందించి పచ్చదనాన్ని మరింత పెంపొందించవచ్చని శ్రీకాంత్ పేర్కొన్నారు. అభివృద్ధి పనులు ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతాయని, కాలనీవాసులు పార్కులను తమ సొంత ఆస్తిగా భావించి పరిశుభ్రత, మొక్కల సంరక్షణలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్లోని ప్రతి కాలనీలో పచ్చదనం పెంపు, పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దేవేందర్ రావు, మాధవరం గోపాల్ రావు, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ అధ్యక్షుడు దివాకర్ రెడ్డి, కార్యదర్శి దశరథ రావు, కార్యవర్గ సభ్యులు చారి, సురేష్, రమేష్ చంద్ర, బాలయ్య, నర్సింగ్ రావు, యూబీడీ సూపర్వైజర్ కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.





