శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లో అక్రమంగా ట్రామడాల్ హైడ్రోక్లోరైడ్ (Tramadol Hydrochloride) ట్యాబ్లెట్లను విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ పోలీసులు ఛేదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం అయ్యప్ప సొసైటీ సాయినగర్‌లోని ప్రైమ్ ఫార్మసీపై దాడి నిర్వహించి, చట్టవిరుద్ధంగా సైకోట్రోపిక్ ఔషధాలను విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ప్రైమ్ ఫార్మసీ యజమాని, ఫార్మసిస్ట్ తోర్రి వెంకటేశం (32), డెలివరీ బాయ్ బర్లకడి శ్రీకాంత్ (32) ఉన్నారు. దాడిలో పోలీసులు 821 స్ట్రిప్‌లలో ఉన్న 6,568 ట్రామడాల్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సుమారు 328.4 గ్రాముల ట్రామడాల్ హైడ్రోక్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు.

పోలీసుల విచారణలో వెంకటేశం నారాయణఖేడ్‌కు చెందిన రాథోడ్ ప్రకాష్ (పరారీలో ఉన్నాడు) నుంచి అక్రమంగా ఈ ట్యాబ్లెట్లను తెప్పించుకుని, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఫార్మసీలో నేరుగా, అలాగే డెలివరీ బాయ్ ద్వారా వినియోగదారులకు విక్రయించినట్లు వెల్లడైంది. చెల్లింపులు నగదు రూపంలో తీసుకున్నట్లు గుర్తించారు. గత కొన్ని నెలలుగా సుమారు 100 నుంచి 150 మంది వినియోగదారులకు ఈ ట్యాబ్లెట్లను సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన సరఫరాదారుడి కోసం గాలింపు కొనసాగుతుండగా, సరఫరా గొలుసు, వినియోగదారుల వివరాలు, డిజిటల్, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండా సైకోట్రోపిక్ ఔషధాలను విక్రయించడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు మాదాపూర్ ఎస్‌హెచ్‌వో తెలిపారు.





