శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ డివిజన్ మార్తాండ్ నగర్‌లో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్‌తో కలిసి బూత్ లెవల్ అధికారుల పనితీరును సమీక్షించి, ఓటరు నమోదు ప్రక్రియ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి, సంతకం చేసి తప్పనిసరిగా బీఎల్‌వోకు అందజేయాలని సూచించారు. ఆగస్టు 10 చివరి తేదీ కావడంతో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా గడువులోగా ఫారాలు సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫారం నింపడంలో సందేహాలు ఉంటే బీఎల్‌వోలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా పారదర్శకంగా, వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి ప్రతి అర్హుడూ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్‌వోలు, సిబ్బందిని అభినందించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్న ఎమ్మెల్యే గాంధీ, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు నమోదులో పాల్గొనాలని కోరారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపడమే కాకుండా బీఎల్‌వోకు తిరిగి అందజేసినప్పుడే నమోదు ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





