శేరిలింగంపల్లి, జూలై 31 (నమస్తే శేరిలింగంపల్లి): వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన, స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ కమిషనర్, వివిధ శాఖల అధికారులతో కలిసి హైటెక్ సిటీ వార్డు పరిధిలోని మస్తాన్ నగర్ మురికివాడను సందర్శించారు. ఈ సందర్భంగా పౌర మౌలిక సదుపాయాలను పరిశీలించి స్థానికులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానికులు పాత బోర్వెల్లు, విద్యుత్ కనెక్షన్ల మరమ్మత్తులు, పనిచేయని వీధి దీపాల పునరుద్ధరణ, తక్కువ నీటి ఒత్తిడితో తాగునీటి సరఫరా ఇబ్బందులు, భూగర్భ మురుగునీటి (యూజీడీ) లీకేజీల కారణంగా మురుగునీరు తాగునీటిలో కలిసే సమస్యలు, ప్రభుత్వ భూమిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం వంటి పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజలు ప్రస్తావించిన అన్ని సమస్యలను అత్యవసరంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఇతర శాఖలు, సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుని నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని సూచించారు. వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా కమిషనర్, ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను వినిపించే అవకాశం కల్పిస్తున్నామని, శాఖల మధ్య సమన్వయంతో వాటిని వేగంగా పరిష్కరించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.





