వరదలపై హైఅలర్ట్.. అధికారులకు ఆరెకపూడి గాంధీ ఆదేశాలు

శేరిలింగంపల్లి, జూలై 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల నేపథ్యంలో ఏర్పడిన వరద పరిస్థితులు, ముందస్తు ఏర్పాట్లు, సహాయక చర్యలపై మియాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అధ్యక్షత వహించారు. జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ కమిషనర్లు సేవా ఇస్లావత్, శ్రీనివాస్, సీఎంసీ ఇంజనీరింగ్ విభాగం, హైడ్రా, పోలీసులు, ట్రాఫిక్, ఎన్‌డీఆర్‌ఎఫ్, జలమండలి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో మ్యాన్‌హోల్‌లో పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన స్థలాన్ని ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదకర ప్రాంతాల్లో వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో గల్లంతైన బాలయ్య కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు తెలిపారు. ప్రతి మ్యాన్‌హోల్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అన్ని విధాలుగా గాలింపు కొనసాగిస్తున్నామని, ఆచూకీ లభించే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. ప్రజలు భారీ వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here