చందానగర్ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు

శేరిలింగంప‌ల్లి, జూలై 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గురుపౌర్ణమి సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ ఫేజ్ 2లో ఉన్న సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకల‌ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ గురుపౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా కూడా పిలుస్తారని, ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను సత్కరించే సంప్రదాయం కొనసాగుతోందని తెలిపారు. గురువులకు పూజలు చేసి, కానుకలు సమర్పించి వారి ఆశీర్వాదాలు పొందడం భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉందన్నారు. వ్యాస మహర్షి జన్మదినం కావడంతో ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు.

గురువులు అంటే కేవలం విద్యను బోధించేవారు మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి జీవితానికి సరైన మార్గాన్ని చూపించే వ్యక్తి అని గాంధీ అన్నారు. హిందూ సంప్రదాయంలో గురువుతో ఏర్పడే అనుబంధం జీవితాంతం కొనసాగుతుందని, కొన్ని కుటుంబాల్లో అది తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని వివరించారు. వేదవ్యాసుడు మానవాళికి అమూల్యమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించిన మహనీయుడని, వేదకాలపు జ్ఞానాన్ని నాలుగు వేదాలుగా సంకలనం చేసి ప్రపంచానికి అందించినందున ఆయనను వేదవ్యాసుడిగా గౌరవిస్తారని తెలిపారు. ఆయన అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ రెడ్డి, ఉరిటి వెంకట్రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ నాయక్, రాజయ్య, నాగరాజు, వెంకటేష్, రాజశేఖర్‌తోపాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here