మియాపూర్‌లో వేగంగా పటేల్, పెద్దకుడి చెరువుల అభివృద్ధి ప‌నులు

శేరిలింగంప‌ల్లి, జూలై 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు, మక్తా మహబూబ్‌పేట్ గ్రామంలోని పెద్దకుడి చెరువుల సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి, పునరుద్ధరణ పనులను మియాపూర్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా చేపట్టనున్న మురుగు నీటి మళ్లింపు (UGD) పైప్‌లైన్ నిర్మాణ పనులతోపాటు చెరువు సుందరీకరణ పనులను సీఎంసీ చీఫ్ ఇంజనీర్ శ్రీలక్ష్మి, ఇరిగేషన్ ఈఈ మల్లేష్, డీఈఈ ఉదయ్ భాస్కర్, జలమండలి డీజీఎం నారాయణ, సీనియర్ నాయకుడు మోహన్ ముదిరాజ్ తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పటేల్, పెద్దకుడి చెరువుల అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుల్లోకి కలుషిత నీరు చేరకుండా మురుగు నీటి మళ్లింపు పైప్‌లైన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, అసంపూర్తిగా ఉన్న పనులకు వేగం పెంచాలని సూచించారు. చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు చెరువుల్లో కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పనుల వల్ల స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో చెరువులను పచ్చదనంతో, ఆహ్లాదకర వాతావరణంతో తీర్చిదిద్దుతామని తెలిపారు. చెరువు కట్టల బలోపేతం, అలుగు మరమ్మత్తులు, పునరుద్ధరణ, చెరువుల చుట్టూ UGD మళ్లింపు పైప్‌లైన్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుతో పాటు ఇతర సుందరీకరణ పనులను సమగ్రంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here