శేరిలింగంపల్లి, జూలై 21 (నమస్తే శేరిలింగంపల్లి): వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని పటాన్చెరు సర్కిల్ పటాన్చెరు వార్డును సందర్శించి పౌర సమస్యలను ప్రత్యక్షంగా సమీక్షించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్, సర్కిల్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమైన కమిషనర్ వార్డులోని మౌలిక వసతులు, ప్రజా సమస్యలపై చర్చించారు.

స్థానికులు డ్రైనేజీ పొంగిపొర్లడం, డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, ఎంపిక చేసిన ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, వీధి కుక్కల సమస్య వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అన్ని సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కమిషనర్ ఆదేశించారు. అవసరమైన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతోపాటు వాటి పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, శాఖల మధ్య సమన్వయంతో వేగంగా అమలు చేయాలని సూచించారు. ప్రజలతో నేరుగా మమేకమై క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, వేగంగా పరిష్కరించడమే వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కమిషనర్ తెలిపారు.





