శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి, పునరుద్ధరణ పనులను మియాపూర్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా నిర్మిస్తున్న మురుగు నీటి మళ్లింపు (UGD) పైప్‌లైన్ పనులతో పాటు చేపట్టనున్న సుందరీకరణ పనులను ఇరిగేషన్ ఈఈ మల్లేష్, డీఈఈ ఉదయ్ భాస్కర్, ఏఈఈ లింగస్వామిలతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పటేల్ చెరువును పూర్తిస్థాయిలో సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా చెరువులోకి కలుషిత నీరు చేరకుండా నిర్మిస్తున్న డ్రైనేజీ మళ్లింపు పైప్‌లైన్ పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులోకి చేరకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పనుల కారణంగా స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో పటేల్ చెరువును సస్యశ్యామలంగా, ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. చెరువు సుందరీకరణలో భాగంగా చెరువు కట్ట బలోపేతం, అలుగు మరమ్మత్తులు, మురుగు నీటి మల్లింపు (UGD) పైప్‌లైన్ నిర్మాణం, చెరువు కట్ట పునరుద్ధరణ, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి పనిని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేసి ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బాలు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.





