శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితకు వాసిలి చంద్రశేఖర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మియాపూర్‌లోని శుభం బ్యాంకెట్ హాల్‌లో నిర్వహించిన పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేయడమే తన లక్ష్యమని వాసిలి చంద్రశేఖర ప్రసాద్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు ఒక పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడ్డప్పటికీ తగిన గుర్తింపు లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ గుర్తించకపోయినా ప్రజా సమస్యల పరిష్కారం, సేవా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూ ప్రజలకు అండగా నిలిచానని తెలిపారు. అదే సేవా స్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అభివృద్ధికి కృషి చేస్తానని, అందులో భాగంగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పార్టీ జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల విజ్ఞప్తిపై స్పందించిన వాసిలి చంద్రశేఖర ప్రసాద్, శేరిలింగంపల్లిలోని జర్నలిస్టులకు గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లావణ్య, గుండె దయానంద్ ముదిరాజ్, సందీప్, కుమార్ తదితరులు పాల్గొని వాసిలి చంద్రశేఖర ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.






