శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చేపట్టిన వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తోపాటు సంబంధిత శాఖల అధికారులు కూకట్‌పల్లి జోన్‌లోని మూసాపేట్ సర్కిల్ పరిధి అల్లాపూర్ వార్డును సందర్శించి పౌర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు, స్థానికులతో కమిషనర్ నేరుగా మాట్లాడి వార్డు అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. గూడ్స్ షెడ్ రోడ్ నుంచి ఐడీఎల్ చెరువు వరకు లింక్ రోడ్డు నిర్మాణం, ఇంటింటి చెత్త సేకరణ కోసం ఎస్‌ఏటీ ఆటోల సంఖ్య పెంపు, రామారావు నగర్‌లో నాలా విస్తరణ, డే-గ్లో సైన్‌బోర్డులు, అదనపు వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలను స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.

అదేవిధంగా సర్దార్ నగర్, రామారావు నగర్, శ్రీనగర్ కాలనీల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా మెరుగుదల, మ్యాన్‌హోల్స్ మరమ్మత్తులు, డీసిల్టింగ్ పనులు, ఇండోర్ స్టేడియంలో షూ ర్యాకులు, అల్మారాల ఏర్పాటు, ఆర్‌కే సొసైటీ బస్తీ దవాఖానకు మరుగుదొడ్లు, ప్రహరీ గోడ నిర్మాణం, క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని సంబంధిత శాఖలు, లైన్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవడం, వార్డు అభివృద్ధిని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం లక్ష్యమని కమిషనర్ తెలిపారు.





