శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ యోజన కింద రూ.26 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించిన కార్యక్రమంలో హైటెక్ సిటీ స్టేషన్ కు కూడా చోటు దక్కింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్. రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి రవికుమార్ యాదవ్‌తోపాటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి విశేష ప్రాధాన్యం లభిస్తోందన్నారు. అమృత్ భారత్ స్టేషన్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా 261 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి చేపట్టగా, వాటిలో 75 స్టేషన్లను ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. దేశంలో కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా పెట్టుబడులు పెడుతోందని ఆయన అన్నారు. 2014తో పోలిస్తే జాతీయ రహదారుల పొడవు 91 వేల కిలోమీటర్ల నుంచి 1.46 లక్షల కిలోమీటర్లకు పెరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు నాలుగు లక్షల కిలోమీటర్ల రహదారులు నిర్మించారని చెప్పారు. మెట్రో రైలు నెట్వర్క్ 248 కిలోమీటర్ల నుంచి 1,095 కిలోమీటర్లకు విస్తరించిందని, దేశవ్యాప్తంగా 164కి పైగా వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం శేరిలింగంపల్లి ప్రజలకు శుభపరిణామమని పేర్కొన్న ఆయన, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైళ్లకు హాల్ట్ కల్పించడంతోపాటు లింగంపల్లి రైల్వే స్టేషన్‌ను కూడా అభివృద్ధి చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆ పనులు కూడా త్వరలోనే సాకారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి నాయకులు, వివిధ మోర్చాల పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





