విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలి: గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జూలై 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకుంటూ విద్యనే ఆయుధంగా భావించి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి బాలయ్య ట్రస్ట్ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆయన కొనియాడారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలయ్య ట్రస్ట్ ఫౌండేషన్ సౌజన్యంతో, ఖాజాగూడ సీనియర్ నాయకుడు సుధాకర్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగాధర్ రెడ్డి విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదివితేనే జీవితంలో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో రాణించి గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, డిజిటల్ విద్య వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సదుపాయాల కల్పనలో తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించి విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాలని సూచించారు. క్రమశిక్షణతోపాటు విలువలతో కూడిన విద్యను అందించాలని కోరారు.

పేద విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఆయన, ఈ దిశగా బాలయ్య ట్రస్ట్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. అనంతరం విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసి, బాగా చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎస్. వెంకటయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, సుధాకర్, అరుణ్ గౌడ్, రాజేష్, వినయ్, కృష్ణ, సాయి, రాజు, బాలకృష్ణ, దినకర్, భారతమ్మ, నిర్మలమ్మ, సుమన్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here