రూ.4.49 కోట్ల అభివృద్ధి పనులకు ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన

శేరిలింగంప‌ల్లి, జూలై 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో అడుగు పడింది. మొత్తం రూ.4.49 కోట్ల వ్యయంతో మియాపూర్, మాదాపూర్ డివిజన్ల పరిధిలో చేపట్టనున్న సీసీ రోడ్లు, వరద నీటి కాల్వల నిర్మాణ పనులకు పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో రూ.82 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మాజీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావులతో కలిసి ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కాలనీల్లో మెరుగైన రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. సీసీ రోడ్ల నిర్మాణంతో కాలనీవాసులకు రవాణా సౌకర్యం మెరుగుపడి, ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని గాంధీ తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో, ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గేలా, సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ కల్పించేందుకు కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, మెరుగైన ప్రజాజీవనానికి అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి కొనసాగుతుందని అరెకపూడి గాంధీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here