శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్లో సుమారు రూ.50 కోట్ల విలువైన సీఎంసీ భూమి కబ్జాదారుల గుప్పిట్లోకి వెళ్లిందని మాజీ కార్పొరేటర్, న్యాయవాది బొబ్బ నవతారెడ్డి ఆరోపించారు. మహిళా భవనం, మోడల్ మార్కెట్, ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం కేటాయించిన సుమారు 4 వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినా అధికారులు స్పందించడం లేదని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లకు గత రెండేళ్లుగా పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ సోమవారం మరోసారి ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.

చందానగర్ డివిజన్ కైలాష్‌నగర్ కాలనీలోని సర్వే నంబర్ 210లో ఉన్న ఈ భూమిని మహిళా భవనం, మోడల్ మార్కెట్, ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2018 మార్చి 7, 2019 మే 5 తేదీల్లో (LC1/3076/2016) జారీ చేసిన ప్రొసీడింగ్స్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించారని ఆమె తెలిపారు. అనంతరం అధికారులు స్థలానికి ప్రహరీ గోడ, గేటు నిర్మించినప్పటికీ, 2022 ఆగస్టు 10న, 2024 ఫిబ్రవరి 9న కబ్జాదారులు ప్రహరీని కూల్చివేసి ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు. స్థలానికి సంబంధించిన వివరాల కోసం ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేయగా, అది మున్సిపల్ కార్పొరేషన్ భూమి కాదని, వివరాలు తమ వద్ద లేవని అధికారులు సమాధానం ఇచ్చారని నవతారెడ్డి తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రొసీడింగ్స్ కాపీలతో 2024లో, అలాగే 2025 నవంబర్లోనూ సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని పేర్కొన్నారు.

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని అదే స్థలంలో టీజీఎస్పీడీసీఎల్ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టారని ఆమె ఆరోపించారు. దీనిపై విద్యుత్ శాఖను ఆర్టీఐ ద్వారా వివరణ కోరగా, ఆ భూమికి సంబంధించిన అధికారిక కేటాయింపు పత్రాలు తమ వద్ద లేవని, ప్రజాప్రతినిధుల సూచన మేరకే నిర్మాణం చేపట్టినట్లు సమాధానం ఇచ్చారని తెలిపారు. మరోవైపు టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 635 కింద నోటీసులు జారీ చేశామని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ప్రకారం వెంటనే భూమిని స్వాధీనం చేసుకుని మహిళా భవనం, ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించాలని నవతారెడ్డి డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో మహిళలతో కలిసి పెద్దఎత్తున ఆందోళనతోపాటు న్యాయపోరాటం చేపడతామని హెచ్చరించారు.





