శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలో భూమిలేని పేదలకు వెంటనే ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1న నిర్వహించనున్న రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి. రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుపేదలు సొంత ఇంటి స్థలం, ఇంటి పట్టా కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా విస్మరించిందని విమర్శించారు. భూమిలేని పేదలకు ఇంటి స్థలాలు కేటాయించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సీపీఐ ఆధ్వర్యంలో పలుమార్లు మండల తహసీల్దార్‌కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. అర్హులైన పేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఒకవైపు పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలం లేదని, మరోవైపు ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఇది పేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఇంటి స్థలాలు, ఇంటి పట్టాల సాధన కోసం జూలై 1న నిర్వహించే కలెక్టరేట్ ముట్టడిలో ఇల్లు లేని పేదలు, కార్మికులు, రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం, ఇంటి పట్టా మంజూరు చేయడంతోపాటు ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు, భూ పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.





